హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోల విడుదల పూర్తయింది. మొదట బీఆర్‌ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేయగా, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ తన మేనిఫెస్టో ప్రకటించింది. ఆఖరున బీజేపీ కూడా తాము అధికారంలోకి వస్తేం ఏం చేస్తామో తెలుపుతూ మేనిఫెస్టో ప్రకటించింది. ఎన్నికలకు సరిగ్గా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ దశలో ప్రజలు పార్టీల ప్రచారంలోపాటు ఆయా పార్టీల మేనిఫెస్టోలను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరికి ఓటు వేస్తే ఎలాంటి లబ్ధి కలుగుతుంది.. అని బేరీజు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా మూడు పార్టీల మేనిఫెస్టోపైనే చర్చ జరుగుతోంది.రెండుసార్లు సంక్షేమ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. మూడోసారి కూడా అదే ఎజెండాతో మేనిఫెస్టో ప్రకటించింది. కొత్త పథకాలు పొందుపరిచారు. రైతుబీమా తరహాలో.. ఈసారి ఎక్కువ మందిపై ప్రభావం చూపేలా కేసీఆర్ బీమా పథకాన్ని తెస్తామని ప్రకటించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న అందరికీ బీమా వర్తింపజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. అన్ని సామాజిక పెన్షన్లు రూ. 5 వేలకు పెంచనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దివ్యాంగులకు పెన్షన్ ప్రస్తుతం రూ. 4 వేలు ఇస్తుండగా రూ.6 వేలకు పెంచుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం రూ. 15 లక్షల పెంపుఅర్హులైన వారందరికీ రూ. 400కే సిలిండర్, అక్రిడేషన్ ఉన్న జర్మలిస్టులకు కూడా రూ. 400కే సిలిండర్ బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో కీలకం.
ఆకర్షణీయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో..
ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ అన్నివర్గాలను ఆకర్షించే మేనిఫెస్టో రూపొందించింది. మహాలక్ష్మి స్కీమ్, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరుతో ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. మేనిఫెస్టోలో కూడా అనేక ఆక్షక అంశాలను చేరారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్?1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ హావిూ ఇచ్చింది. ఏప్రిల్ ఒకటిన గ్రూప్?2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తేదీలతో సహా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. జూన్ 1న గ్రూప్?3, గ్రూప్?4 నియామకాలకు నోటిఫికేషన్ వెల్లడిస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రైతు కూలీలు, కౌలు రైతులు ఆర్థికసాయం, ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, 250 యూనిట్ల ఉచిత విద్యుత్,
రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ. రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు, ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 లక్షలు, 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ, నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ. 6 వేలకు పెంపు వంటి అంశాలు ఉన్నాయి.
ఇదీ బీజేపీ మేనిఫెస్టో..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. చేపట్టబోయే 10 అంశాలకు సంబంధించిన కార్యాచరణను మేనిఫెస్టోలో పొందుపరిచింది. సకలజనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. సకల జనుల సౌభాగ్య.. పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో.. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టనున్నట్టు అమిత్ షా తెలిపారు. అవినీతిని ఉక్కుపాతంతో అణచివేయటంతోపాటు ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్? సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్.. నినాదంతో పాలన సాగిస్తామని తెలిపారు.
మహిళలకు పది లక్షల ఉద్యోగాలు..
రైతే రాజు? అన్నదాతలకు అందలం
విద్యాశ్రీ? నాణ్యమైన విద్య
ప్రజలందరికీ సుపరిపాలన? సమర్థవంతమైన పాలన
యువశక్తి?ఉపాధి
వారసత్వం?సంస్కృతి చరిత్ర
సంపూర్ణ వికాసం? పరిశ్రమలు, మౌలిక వసతులు
నారీశక్తి? మహిళల నేతృత్వంలో అభివృద్ధి
వైద్యశ్రీ? నాణ్యమైన వైద్యసంరక్షణ
వెనుకబడిన వర్గాల సాధికారికత? అందరికీ చట్టం సమానంగా వర్తింపు
కూడు?గూడు ఆహార నివాస భద్రత. అంశాలను చేర్చింది.
బీఆర్‌ఎస్, బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాలు ఎక్కువగా కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్‌లో మాత్రం చాలా వరకు ఆకర్షణీయ అంశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీల మేనిఫెస్టోపై చర్చ జరుగుతోంది. ఆకర్షణీయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండగా, తర్వాత స్థానంలో బీఆర్‌ఎస్, చివరన బీజేపీ మేనిఫెస్టో ఉన్నాయి. ఇక అన్ని పార్టీలు విద్య, ఆరోగ్యానికి అధిక ప్రధాన్యం ఇచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ రూ.10 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని తెలుపగా, బీఆర్‌ఎస్ రూ.15 లక్షలకు పెంచుతామని ప్రకటించింది. విద్యకు అన్ని పార్టీలు ప్రత్యేక పాఠశాలలు, గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం ఇచ్చాయి. గతంలో బీఆర్‌ఎస్ గెలుపులో ఈ అంశం కీలకంగా మారింది. కానీ, ఈసారి బీఆర్‌ఎస్ దానిని విస్మరించింది. మేనిఫెస్టోలో పేర్కొనలేదు. దీంతో కాంగ్రెస్, బీజేపీ దానిని కీలకంగా తమ మేనిఫెస్టోలో పేర్కొన్నాయి. కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని ప్రకటించగా, బీజేపీ 10 లక్షల మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది.