డిసెంబర్‌ 7న ఎన్నికలు..?
తాత్కాలిక షెడ్యూల్‌ సిద్ధం చేసీన ఈసీ
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25:  తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగనుంది. జమిలీ ఎన్నికల పేరుతో ఇప్పటి వరకు కాస్త సందిగ్ధత కనిపించింది. లెక్క ప్రకారం డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయా… లేక… ఒకే దేశం`ఒకే ఎన్నిక ఫార్ములా అమల్లోకి తెచ్చి 2024లో లోక్‌సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు పెడతారా? అన్న అంశంపై సస్పెన్స్‌ కొనసాగింది. కానీ… ఆ అనుమానాలన్నీ ఇప్పుడు తీరిపోయాయి. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు.. ఎలక్షన్‌ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. ఎన్నికల తేదీలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్‌ కూడా సిద్ధం చేసింది. ఆ షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ నిర్వహించి… ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఇది తాత్కాలిక షెడ్యూలు మాత్రమే. అయినా… కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. నవంబర్‌ 12 ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించి… నవంబర్‌ 19న నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ముగిశాక నవంబర్‌ 22న తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు. డివెంబర్‌ 7న ఎన్నికలు జరుగుతాయి. అక్కడి నుంచి మరో నాలుగు రోజుల తర్వాత అంటే డిసెంబర్‌ 11న కౌంటింగ్‌ ఉంటుంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా ఇదే. 2018లో డిసెంబర్‌ 7న ఎన్నికలు జరిగాయి… 11న ఫలితాలు ప్రకటించారు. ఆ తరువాత జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీని ప్రకారం చూస్తే… 2024లో జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంటుంది. అది జరగాలంటే… షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరగాలి. అందుకే.. దానికి అనుగుణంగా ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యేలా ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిశంబర్‌లో ఎన్నికలను నిర్వహించాలంటే… ఎన్నికల కమిషన్‌ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఈసీ ఆ పనిలోనే బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాడ్‌ తనిఖీలు కూడా పూర్తిచేశారట. ఇక… ఒకదాని తర్వాత మరొకటి… వరుసగా ఎన్నికల పనులు జరిగిపోతాయని చెప్తున్నారు. అక్టోబర్‌లో… ఎన్నికల సామాగ్రి సవిూకరణ, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, కౌంటింగ్‌ కేంద్రాల పరిశీలన, రిటర్నింగ్‌ అధికారులు, సెక్టార్‌ అధికారుల శిక్షణ, జిల్లాలకు నిధుల కేటాయింపు వంటి వాటిపై దృష్టి పెడతారు. ఈ పనులన్నీ అక్టోబర్‌లోపు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే… నవంబర్‌లో పోలీసు సిబ్బందికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల ప్రకటన, పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ, ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్ల నియామకం, బ్యాలెట్‌ పరిశీలకులకు శిక్షణ వంటి పనులు ఉంటాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలో బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ టీమ్‌లో ఎలక్షన్‌ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తోపాటు పలువురు అధికారులు ఉన్నారు. అక్టోబర్‌ 3 నుంచి 5వ తేదీ వరకు వీరి బృందం తెలంగాణలో పర్యటిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తారని సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *