శ్రీకాకుళం, సెప్టెంబర్‌ 25: వైసీపీ పరంగానూ.. ప్రభుత్వంలోనూ కీలక నాయకుడు ధర్మాన ప్రసాదరావు. విషయ పరిజ్ఞానం ఉండి? ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడతారన్న పేరున్న ధర్మాన ప్రస్తుతం ట్రాక్‌ తప్పారా అన్న అనుమానాలు వస్తున్నాయట రాజకీయ వర్గాలకు. అలా ఎందుకయ్యా.. అంటే.. మంత్రి మాట్లాడుతున్న మాటలేనన్నది ఆన్సర్‌. ఒకప్పడు ఆయన మాటల విూద చర్చలు జరగ్గా ఇప్పుడు మాత్రం రచ్చ మాత్రమే అవుతోందంటున్నారు. ఇది మరీ శృతి మించి వైసీపీ అధిష్టానం వార్నింగ్‌ ఇచ్చే దాకా వెళ్ళినట్టు తెలిసింది. ధర్మాన వ్యాఖ్యలు పార్టీకి ప్లస్‌ అవకపోగా.. ఎక్కువగా నష్టం చేస్తున్నట్టు పార్టీ పెద్దలకు నివేదిక అందిందట. అందుకని వాళ్ళే నేరుగా జోక్యం చేసుకుని నోరు అదుపులో ఉండకపోతే తర్వాత విూ ఇష్టం అని గట్టిగానే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ లీడర్‌ అయి ఉండి, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ఈ మధ్యనే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అది కావాలని చేస్తున్న పనా? లేక యాధృచికమా అన్న అనుమానాలు వస్తున్నాయట నాయకత్వానికి. యాధృచికమైతే ప్రతిసారి ఎలా సాధ్యమన్న డౌట్స్‌ కూడా ఉన్నట్టు తెలిసింది. మగాళ్ళంతా ఉత్త పోరంబోకులు అంటూ గతంలో మంత్రి అన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి.తాజాగా మహిళలు వైసిపికి ఓటు వేయకపోతే వారి పీక వారు కోసుకున్నట్లే, వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్టేనని అన్నారాయన. దీంతో ఓటేయడానికి, పీకలు కోయడానికి లింక్‌ పెట్టడమేంటన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ మధ్యనే టీచర్స్‌ని ఉద్దేశించి ఉపాధ్యాయులు పనిచేయకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని అనడంపై మండిపడుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఎక్కడో? ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి మొత్తం టీచర్‌ కమ్యూనిటీని బాధ్యుల్ని చేస్తూ? మంత్రి స్థాయిలో ఉండి తమ ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టారని మండిపడుతున్నారట. ఉపాధ్యాయులు ఎవరూ పాఠశాలలకు రావడం లేదని, అందుకోసమే ఫేసియల్‌ యాప్‌ పెట్టామని అనడం దారుణం అంటున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారని అనడంపై రివర్స్‌ అటాక్‌ చేస్తున్నారు కొందరు అయ్యవార్లు. రెవెన్యూ మంత్రిగా ఉండి విూరు రియల్‌ ఎస్టేట్‌ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి కిళ్లిపాలెంలో, గూడెం వద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మంత్రి చేయడం లేదా అంటూ ప్రెస్‌ విూట్‌ పెట్టి మరీ ప్రశ్నించారు ఉపాధ్యాయ సంఘాల నాయకులు. మంత్రి వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే శ్రీకాకుళం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. గతంలో ఉన్న ఆయన పరిజ్ఞానమంతా ఏమైపోయిందని మాట్లాడుకుంటున్నారు స్థానికులు. ఎన్నికల టైంలో ధర్మాన మాటలతో పార్టీ ముఖ్య నేతలు సైతం తలకొట్టుకుంటున్నారట.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *