చేవెళ్ల: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీలో చేరారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనను చూడలేకే కేఎస్ రత్నం బీజేపీలో చేరారని ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కవల పిల్లలని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తొలుత కాంగ్రెస్ పార్టీలో పని చేశారని… ఈ విషయం రాహుల్ గాంధీకి తెలుసా? అని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ కేంద్ర మంతి పదవిని కూడా పొందారని చెప్పారు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న చరిత్ర బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారు ఆ తర్వాత బీఆర్‌ఎస్ లో చేరి మంత్రులుగా కొనసాగుతున్నారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ జలదృశ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టిన సందర్భంగా తనకు ఇంకా 7 నెలల పదవీ కాలం ఉండాగానే పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ లో చేరానన్నారు. అలాంటి తనకు బీఆర్‌ఎస్ లో గుర్తింపు దక్కలేదన్నారు. పార్టీలో తనకు పదవులు ఇవ్వలేదని తాను ప్రశ్నిస్తాననే ఉద్దేశంతోనే తనకు కేసీఆర్ పదవులు ఇవ్వలేదేమో అని విమర్శించారు. తనకు టికెట్ దక్కినా దక్కకపోయినా బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు.