23న టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి భేటీ
ముఖ్యమంత్రి పదవి కంటే తనకు ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
విజయవాడ, అక్టోబరు 21:టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ ఈనెల 23న జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నారా లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి పోరాటం, పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. ఇప్పటికే ఇరు పార్టీలు సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులను ప్రకటించాయి. ముఖ్యమంత్రి పదవి కంటే తనకు ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి నేను పూర్తి సుముఖంగా ఉన్నానని అన్నారు. వైసీపీని గద్దె దించే రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం వస్తే దాన్ని కచ్చితంగా స్వీకరిస్తానని, అయితే దాని కంటే ముందు తనకు రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ‘2024లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దూరం చేసి జనసేన` తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రతి కార్యకర్త బలంగా పనిచేయాలి. ‘ప్రతికూల పరిస్థితుల్లోనే ఓ మనిషి అసలు స్వరూపం బయటపడుతుందని చెబుతారు. పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో నా వెంట నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలోకి రాగానే అధికారం, పదవులు వస్తాయని చాలా మంది భావించారు. వారంతా తర్వాత కాలంలో వెళ్లిపోయారు. అయితే ఎలాంటి పదవులు లేకున్నా, అధికారంలోనూ లేకపోయినా నాతో పాటు కలిసి నడిచి, పార్టీ కోసం పనిచేసిన వారు ఎందరో ఉన్నారు. వారి సేవలు, వారిని నిత్యం గుర్తుపెట్టుకుంటాను. 2024లో సమష్టిగా రాష్ట్ర బాగు కోసం, ‘చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అధిగమించి పని చేద్దాం. కేవలం 150 మంది సభ్యులతో మొదలైన జనసేన ప్రస్థానం నేడు 6.50 లక్షల క్రియాశీలక సభ్యులకు చేరింది. ప్రతిరోజూ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్‌ పార్టీకి వెన్నెముకగా పనిచేస్తున్నారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీకి సంబంధించిన 12 కమిటీల్లో రాష్ట్ర కార్యవర్గం 200 పైచిలుకు సభ్యులు అయ్యారు. నూతనంగా రాష్ట్ర కార్యవర్గంలో చేరిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలి’ అని పార్టీ శ్రేణులను కోరారు. ఇంగ్లీష్‌ భాష నేర్చుకుంటే అద్భుతాలు జరిగితే అమెరికాలో పేదలే ఉండకూడదు. బ్రిటన్‌, న్యూయార్క్‌ వంటి దేశాల్లో ఎవరూ రోడ్ల వెంట తిరిగేవారు కాదు. ఐబీ సిలబస్‌ పెట్టడం వెనుక వేరే కుంభకోణం ఉంది. ఒప్పందం జరిగిన తర్వాత ఏదైనా తేడా వస్తే మనం స్విట్జర్లాండ్‌లో కోర్టుకు వెళ్లి దావా వేయాలి. వీటిపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి. దేశంలో ఐబీ సిలబస్‌ స్కూళ్లు 1200 మాత్రమే ఉన్నాయి. ఐబీ సిలబస్‌ వెనక తప్పకుండా స్కాం ఉంది. జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *