విజయవాడ, ఆగస్టు 27: ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ బయటకు వచ్చింది చాలా తక్కువ. తొలి మూడు సంవత్సరాలు ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం అయ్యారు. అయితే చివరి రెండేళ్లు బయటకు రావడం ప్రారంభించారు. ప్రజల మధ్యలోనే సంక్షేమ పథకాలకు బటన్ నొక్కేవారు. అయితే జగన్ బయటకు అడుగుపెడితే పరదాలు, ఫుల్ సెక్యూరిటీ కనిపించేది. జన సవిూకరణ భారీగా చేసేవారు. కానీ అందుకు విరుద్ధంగా సాగుతోంది చంద్రబాబు ప్రయాణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటుతోంది. సీఎం చంద్రబాబు నుంచి ఎమ్మెల్యేల వరకు ఎక్కడా ఆర్భాటం చేయడం లేదు. నెలలో విధిగా రెండుసార్లు సీఎం చంద్రబాబు ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ పరదాలు కట్టడం లేదు. ట్రాఫిక్ ఆంక్షలు లేవు. ప్రజలకు నిర్బంధాలు లేవు. చివరకు వామపక్షాల నేతల హౌస్ అరెస్టులు కూడా లేవు. సాఫీగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు చంద్రబాబు. ప్రజల్లో ఒక రకమైన చర్చకు కారణమవుతోంది ఈ పరిస్థితి. గతానికి భిన్నంగా పాలన సాగుతుండడంతో తటస్థులు ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణులకు సైతం సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6 తర్వాత అధికారులతో సవిూక్షలు వద్దని కూడా సూచించారు. పబ్లిక్ ప్లేసుల్లో బహిరంగ విూటింగులు వద్దని కూడా ఆదేశాలు ఇచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది. వాలంటీర్ల ద్వారా కాకుండా.. ప్రభుత్వ సిబ్బందితోనే అందిస్తోంది. జూలై, ఆగస్టు నెలల్లో విజయవంతంగా పింఛన్ల పంపిణీని పూర్తి చేసింది. చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించారు. వారితో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కూడా సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు.అటు చంద్రబాబులో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వస్తున్న వినతులను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. గుడివాడలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు చంద్రబాబు. ఓ ఆటో డ్రైవర్ తన సమస్యను చెప్పుకున్నాడు. గతంలో టిడిపి ప్రభుత్వమే తనకు కార్పొరేషన్ ద్వారా ఆటో అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఎలక్ట్రికల్ ఆటో ఇస్తే తన జీవనం మరింత మెరుగుపడుతుందని చెప్పడంతో అక్కడికక్కడే మంజూరు చేయించారు. ఓ బధిరుడు తనకు ఎలక్ట్రికల్ స్కూటీ కావాలని చంద్రబాబును అడిగితే వెనువెంటనే సమకూర్చారు. గతంలో చంద్రబాబు ఈ విషయంలో ఆశించిన స్థాయిలో స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు సత్వర పరిష్కారానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.గతంలో జగన్ పై ఒక అపవాదు ఉండేది. ఎటువంటి ఘటనలకైనా స్పందించే వారు కాదని ప్రతిపక్షాలు విమర్శించేవి. పంటలకు నష్టం వాటిల్లినప్పుడు కూడా ఏరియల్ సర్వే కి పరిమితం అయ్యేవారు. కానీ చంద్రబాబు అలా కాదు. వెనువెంటనే రంగంలోకి దిగుతున్నారు. అచ్యుతాపురం ఫార్మా ఘటనపై వెంటనే స్పందించారు. సత్వర చర్యలకు ఉపక్రమించారు. బాధితులను పరామర్శించి పరిహారం ప్రకటించారు. అటు పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఇలా ఎలా చూసుకున్నా బాధ్యతలు స్వీకరించిన ఆ క్షణం నుంచి రంగంలోకి దిగారు చంద్రబాబు.