విజయవాడ, అక్టోబరు 5: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఇబ్బందిగా ఉన్నా భాగస్వామ్య కూటమి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పలేదన్నారు పవన్ కల్యాణ్. టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ జగన్ ను పాతాళానికి తొక్కేయవచ్చని స్పష్టం చేశారు. టీడీపీ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నపుడు, విూ పార్టీ అనుభవం రాష్ట్రానికి అవసరమని తాను మద్దతు తెలిపినట్లు వెల్లడిరచారు. అయితే పవన్ పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఎన్డీఏ నుంచి తప్పుకోనున్నట్లు సంకేతాలు ఇచ్చారా అనే చర్చ మొదలైంది. ఏపీలో ఏం జరుగుతుందో ప్రధానికి తెలియదా అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రధానికి తెలిసిన వ్యక్తిని ఇంత ఇబ్బంది పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి ? ప్రశ్నించారు. తాను ఎప్పుడు ప్రధానికి కంప్లయింట్ చేయలేదన్నారు. కేసులకు భయపడే వాడినైతే రాజకీయాల్లోకి రానన్నారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదన్న పవన్, నాపై కేసులు పెట్టుకోవచ్చని, ఎక్కడికైనా వస్తానని స్పష్టం చేశారు. తాను ప్రజారాజ్యం యువ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నపుడు, జగన్ రాజకీయాల్లోనే లేడని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే గొడవ పెట్టుకున్నానన్న పవన్, ఎవరికి భయపడనని స్పష్టం చేశారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల తర్వాత జనసేన`టీడీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓట్లు వేయించుకునేందుకే, వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. నిధుల మళ్లింపులో రాష్ట్రానిదే అగ్రస్థానమని కేంద్రం చెప్పిందన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే కులాలను దాటి రాజకీయాలు ఉండాలన్నారు పవనల్ కల్యాణ్. బీసీలను బీసీల చేత, కమ్మ వారిని కమ్మ వారి చేత తిట్టిస్తారని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. రాష్ట్ర యువత కూడా కులాలకు అతీతంగా ఆలోచించాలన్న ఆయన, మన మధ్య ఉన్న విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలు వచ్చేసరికి మనమంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలను ఆయా కులాల వారితో తిట్టించడం జగన్ నైజమన్న పవన్ కల్యాణ్, జగన్‌కు ఒంట్లో పావలా దమ్ము లేదన్నారు. సోనియా గాంధీ చూస్తారని భయపడి చాటుగా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు పవన్ కల్యాణ్. కొత్త పాస్ బుక్ కు 10వేలు, రొయ్యల చెరువు ట్రాన్స్ ఫార్మర్ వేయించుకోవాలంటే 2లక్షలు లంచం వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అది కూడా ఇష్టమొచ్చిన కంపెనీ ట్రాన్స్ ఫార్మర్ వేయించుకుంటే ఒప్పుకోరని అన్నారు. తీర ప్రాంతాలను దోచేశారన్న పవన్ కల్యాణ్, ఇసుక దిబ్బలను తవ్వేశారని ఆరోపించారు. మడ అడవులను ధ్వంసం చేసి, అక్రమంగా రొయ్యల చెరువులు పెట్టుకున్నారని విమర్శించారు. మడ అడవులపై గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి పోరాటం చేస్తున్న జనసైనికులపై పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. జగనన్న ఏపీ బంగారు భవిష్యత్తు కాదని, ఆయనో విపత్తు అని విమర్శించారు పవన్ కల్యాణ్. 28 లక్షల ఇళ్లు కడతామని చెప్పి, 3 లక్షల ఇళ్లే కట్టారని తెలిపారు. ఇళ్ల పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారని నివేదికలే చెబుతున్నాయని పవన్ అన్నారు. కొనకళ్ల నారాయణపై దాడి, తనకు చాలా ఆవేదన కలిగించిందన్నారు. ప్రజలను కులాలుగా విడదీసి నేను రాజకీయాలు చేయనన్న పవన్, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ చూస్తానన్నారు. ఏపీ ప్రజలు గర్వంగా తలెత్తుకుని బతకాలనేదే తన ఆశయమని ప్రకటించారు. కేంద్రం నుంచి వచ్చిన జాతీయ ఉపాధి హావిూ పథకం నిధులను వైసీపీ నేతలు సగానికి సగం దోచుకున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జనసైనికులు మట్టి తవ్వకాలు అడ్డుకుంటే హత్యాయత్నం కేసులు పెట్టారని విమర్శించారు. ఎదురు తిరిగి మాట్లాడితే దేశద్రోహం కేసులు పెట్టిందని మండిపడ్డారు.