కడప, సెప్టెంబర్ 29: ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అయితే ఎంపీ గానా? లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పదేళ్లపాటు కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తన రాజకీయ శత్రువు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీ కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానిది ప్రత్యేక స్థానం. ఆ కుటుంబానికి పెద్దిరెడ్డి కుటుంబంతో దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. అయితే ఒకే పార్టీలో కలిసి పని చేసే క్రమంలో తన రాజకీయ ఎదుగుదలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డు తగిలారని కిరణ్ కుమార్ రెడ్డి చెబుతుంటారు. కిరణ్ సీఎం పదవి బాధ్యతలు చేపట్టడం పెద్దిరెడ్డికి ఇష్టం లేదని.. అందుకే జగన్కు మద్దతుగా రెడ్డి సామాజిక వర్గాన్ని కూడగట్టడంలో పెద్దిరెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని కొన్ని సందర్భాల్లో కిరణ్ సైతం చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డిని చావు దెబ్బ కొట్టాలని కిరణ్ భావిస్తున్నారు. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లోను ఆయనే పోటీ చేస్తారని భావిస్తున్నారు. మిధున్ రెడ్డిని ఓడిరచాలని కిరణ్ పంతం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలో రైల్వేకోడూరు, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, మదనపల్లె, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పీలేరు కిరణ్ సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో కిరణ్ కు మంచి పట్టు ఉంది. ప్రస్తుతం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా కిరణ్ సోదరుడు కిషోర్ ఉన్నారు.బిజెపి, టిడిపి మధ్య పొత్తు కుదిరితే రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగడం ఖాయంగా తేలుతోంది. ఎంపీగా పోటీ చేసి గెలుపొందితే కిరణ్ కు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాజంపేట పెద్దిరెడ్డి కుటుంబానికి పెట్టని కోట. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన రాజంపేట మాత్రం వైసీపీకి దక్కింది. గత పదేళ్లుగా పెద్దిరెడ్డి కుటుంబం రాజంపేట పై పట్టు బిగిస్తూ వస్తోంది. దానిని అధిగమించాలంటే కిరణ్ కుమార్ రెడ్డి సరైన అభ్యర్థి అని భావిస్తున్నారు. పొత్తులో భాగంగా చంద్రబాబు సైతం కిరణ్ అభ్యర్థిత్వానికి జై కొడతారని టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటివరకు కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం లో అడుగు పెట్టలేదు. కానీ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులతో సుమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ రీఎంట్రీ ఖాయమని తేలుతోంది.