విజయవాడ, జూన్‌ 4:ఒక అసాధ్యం సుసాధ్యమైన సమయమిది. చరిత్ర తిరగరాసిన విజయమిది. కనీవినీ ఎరుగని గెలుపు ఇది. ఎన్నెన్నో రికార్డులు బద్ధలైన సందర్భమిది. కూటమిగా వచ్చి ప్రత్యర్థి ఖేల్‌ ఖతం చేసిన ఎన్నిక ఇది. ఆంధ్రాలో టీడీపీ`జనసేన`బీజేపీ కూటమి చేసిన మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. వార్‌ వన్‌ సైడే అంటే ఇదే. 175 స్థానాల్లో ఏకంగా 164 సాధించడం అంటే మాటలు కాదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా సాగిన విజయమిది. ఎన్నడూ దక్కని నియోజకవర్గాలు టీడీపీ వశమయ్యాయి.ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ చేశాయి. వై నాట్‌ 175 అంటూ రంగంలోకి దిగిన జగన్‌ కు ఫలితాలు ఊహించని షాక్‌ ను ఇచ్చాయి. టీడీపీ కూటమి వార్‌ వన్‌ సైడ్‌ చేసేసింది. ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ఫలితం వచ్చింది. ఈ గెలుపు అసాధారణం. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా.. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి. ఫలితాల్లో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ స్ట్రైక్‌ రేట్‌ ఓ రేంజ్‌ లో ఉంది. జనసేన అయితే 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 165 చోట్ల గెలుపొందింది టీడీపీ కూటమి. 136 చోట్ల సైకిల్‌ పార్టీ, 21 స్థానాల్లో జనసేన, బీజేపీ 8 సీట్లలో గెలుపొందాయి. అసలు పొలిటికల్‌ పండిరట్స్‌ కు కూడా అందని లెక్క ఇది. పోలింగ్‌ పర్సెంటేజ్‌ పెరగడంతో ఈసారి లెక్కలు తారుమారవుతాయన్న అంచనాలు పెరిగాయి. అనుకున్నట్లుగానే ఫలితం వచ్చింది. అధికారం చేతులు మారింది.ఎన్నో విమర్శలు, ఇంకెన్నో సవాళ్ల మధ్య పోటీకి దిగిన కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు`పవన్‌ జోడీ జనంలో చాలా ఎఫెక్ట్‌ చూపించింది. ఇక ఆంధ్రా గాడిన పడాలంటే బాబు మళ్లీ రావాల్సిందే అన్న పాయింట్‌ జనంలోకి బలంగా వెళ్లింది. బాబు షూరిటీ ? భవిష్యత్‌ కు గ్యారెంటీ అన్న ప్రచారం ప్రజలను ఆలోచింపజేసింది. రాజధాని లేని రాష్ట్రంగా మారిన ఏపీకి దశ దిశ చూపించే బాధ్యతను టీడీపీ కూటమిపై పెట్టారు జనం. ఈస్ట్‌, వెస్ట్‌ నార్త్‌ సౌత్‌.. కార్నర్‌ ఏదైనా టీడీపీ కూటమిదే ఘన విజయం అన్నట్లుగా తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యం కొనసాగింది. ఉత్కంఠ పోరు ఉంటుందనుకున్నారు. కానీ కౌంటింగ్‌ మొదలయ్యాక సీన్‌ కూటమివైపు మారిపోయింది.ఏళ్ల వయసులో చంద్రబాబు తన విశ్వరూపాన్ని మరోసారి చూపించారు. మండే ఎండలు, జోరు వర్షాలను లెక్కచేయకుండా, గొంతులో వాయిస్‌ బేస్‌ తగ్గకుండా చేసిన ప్రచారం, అందుకు స్పందించిన జనం, వచ్చిన ఫలితం ఇవన్నీ మరపురానివే. ముసలోడు అని గేలి చేసిన వారు నోరెళ్ల బెట్టేలా ఒంటిచేత్తో ప్రచారాలు హోరెత్తించారు. అగ్నికి వాయువు తోడైనట్లుగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మాటల తూటాలతో చెలరేగిపోయారు. పేదలకు, పెత్తందారులకు మధ్య పోటీ అంటూ జగన్‌ చేసిన ప్రకటనను సవాల్‌ గా తీసుకుని నిజమైన పెత్తందారు ఎవరో ప్రజలకు వివరించటంలో సక్సెస్‌ అయ్యారు.తగ్గాల్సిన చోట తగ్గారు. నెగ్గాల్సిన చోట నెగ్గారు. అందుకే ఈ ప్రజా విజయం సాధ్యమైంది. 2021 నవంబర్‌ 19న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో కలత చెందిన చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తానని ఆనాడే శపథం చేశారు. ఇప్పుడు మళ్లీ ఘన విజయం సాధించడం ద్వారా తన పంతం నెగ్గించుకున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మొదటి నుంచి పవన్‌ కల్యాణ్‌ నెరిపిన మంత్రాంగం ఫలించింది. పొత్తులు పెట్టుకుంటేనే గెలుస్తాం అని చెప్పి అటు ఢల్లీిని, ఇటు చంద్రబాబును ఒప్పించి సక్సెస్‌ అయ్యారు జనసేనాని.ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లోనూ 25 సీట్లకు గానూ కూటమి 21 సీట్లు సాధించింది. టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 చోట్ల గెలిచాయి. మొత్తంగా ఈ విజయం చరిత్ర సృష్టించింది. కథ మార్చేసింది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *