అధికారులకు రెండు కోట్లు
విజయవాడ, మే 20 : సీఎం జగన్‌ తరచూ తాను పేద వాడినని చెబుతుంటారు. పెత్తందారులతో పోరాడుతున్నానని పదేపదే మాట్లాడుతుంటారు. కనీసం తన వద్ద ఫోన్‌ కూడా లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే జగన్‌ పేదతనంపై సోషల్‌ విూడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. పెత్తందారు నేలపైన, పేదవాడు విమానాల్లో అంటూ సోషల్‌ విూడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఏపీలో పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో.. సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సమేతంగా యూరప్‌ లో పర్యటించనున్నారు. దాదాపు రెండు వారాలపాటు వేసవి విడిది చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నా.. ఈ రాష్ట్రానికి సీఎంగా ఆయన రక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇది విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. విదేశీ పర్యటనకు జగన్‌ కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తిరిగి జూన్‌ 1 రాష్ట్రానికి రానున్నారు. అయితే జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. విస్టా జెట్‌ కంపెనీకి చెందిన బొంబార్దియర్‌ 7500 అనే విలాసవంతమైన ప్రత్యేక విమానంలో ఆయన పర్యటనకు వెళ్లారు. దాని ఖర్చు గంటకు అక్షరాలా 12 లక్షల రూపాయలు. ఒకరోజు ముందుగానే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్‌ కు చేరుకుంది. గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసే జగన్‌ పేదవాడా? పెత్తందారా? అని సోషల్‌ విూడియాలో ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.మరోవైపు సీఎం జగన్‌ కు రక్షణగా నలుగురు అధికారులు ఇప్పటికే లండన్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. వారికి విమాన టిక్కెట్లు, వసతి, ఇతరత్రా ఖర్చులు కలిపి కోటిన్నర కు పైగా ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌ వ్యక్తిగత పర్యటన అయినా.. ఆయన కుటుంబం వరకు ఆయనే భరించినా.. భద్రతా సిబ్బంది ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి ఎన్నికల్లో తాను పేదనని చెప్పుకునే జగన్‌.. విమానానికే గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేజేతులా ఆయన విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించినట్లు అవుతోంది. మరో వైపు ఈ విమానం లండన్‌ చేరుకున్నాక.. రన్వేపై ఆగిన తర్వాత ఎవరో ఫోటో తీశారు. సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశారు. ఆలీ కలర్‌ రంగు, రెడ్‌ టేప్‌ తో ఉన్న ఈ విమానం నుంచి సీఎం జగన్‌ కిందకు దిగుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. అయితే వెంట మందీ మార్బలం ఏది కనిపించకపోవడం విశేషం. జగన్‌ తన చేతిలో రెడ్‌ కలర్‌ లో ఉన్న ఒక స్వెటర్ను తీసుకుని విమానం నుంచి కిందకు దిగిన దృశ్యం మాత్రం కనిపించింది. అప్పటికే లండన్‌ వెళ్లిన భద్రత సిబ్బంది ఆయనను అనుసరించడం.. వారు సమకూర్చిన కారులో వెళ్లిపోవడం జరిగిపోయింది.సీఎం జగన్‌ తో పాటు సతీమణి భారతి, కుమార్తెలు హర్ష, వర్షాలు ఉన్నారు. రెండు వారాల పాటు వీరు లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ లో గడపనున్నారు. కాగా లండన్‌ విమానాశ్రయంలో జగన్కు ఘన స్వాగతం లభించింది. జగన్‌ ను చూసేందుకు లండన్‌ లోని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్నారై విభాగం నాయకులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి రావడం గమనార్హం. జగన్‌ కుటుంబం నాలుగు రోజులపాటు లండన్‌ లోనే గడపనుంది. తరువాత స్విట్జర్లాండ్‌ వెళ్లనుంది. అటు తరువాత ఫ్రాన్స్‌ కు వెళ్లి.. కొద్దిరోజుల పాటు విడిది చేసి ఏపీకి రానున్నట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *