ఒంగోలు మార్చి 19: అనుకున్నట్టే అయ్యింది. వాలంటీర్లకు జగన్‌ దెబ్బ తగిలింది. వారి ఉనికి ప్రశ్నార్ధకం కానుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వలంటీర్లపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ హెచ్చరించింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను ఎక్కడికక్కడే వారిని టిడిపి,జనసేన శ్రేణులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. కడప జిల్లాలో అయితే వాలంటీర్ర్‌ పై దాడి జరిగింది. ఇంటింటికి వెళ్లి వైసిపి కరపత్రాలు అందించడమే కారణం. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒకరిని నియమించారు.   ఈ వాలంటీర్‌ వ్యవస్థ మూలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. పేరుకే అది వ్యవస్థ కానీ.. అది వైసిపి సైన్యంగా పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్‌ వ్యవస్థ తోనే మరోసారి అధికారంలోకి వస్తానని జగన్‌ ధీమాతో ఉన్నారు. అయితే వారిని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించాల్సింది పోయి.. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టే కార్యక్రమాన్ని అప్పగించారు. మరోసారి జగన్‌ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని.. లేకుంటే నిలిచిపోతాయని కరపత్రాల్లో పొందుపరిచారు. వాటిని తమ పరిధిలోని 50 కుటుంబాలకు అందించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు.అయితే ఇప్పుడు వాలంటీర్ల పై కత్తి వేలాడుతోంది. . 5000 రూపాయల వేతనంతో వాలంటీర్‌ ఇప్పటివరకు పని చేస్తూ వస్తున్నారు. వారు వైసిపి సానుభూతిపరులే అయినా.. రాజకీయాలు చేసినా .. ఇన్ని రోజులు చెల్లుబాటు అయ్యింది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు. వాలంటీర్ల పై కేసులు, దాడులు పెరిగే ఛాన్స్‌ ఉంది. దీనికి ముమ్మాటికీ జగనే కారణం. వాలంటీర్‌ వ్యవస్థను రాజకీయంగా వినియోగించుకోవాలన్న ప్రయత్నం ఎన్నికల ముంగిట ఎన్నెన్నో ఇబ్బందులను తెచ్చే పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యధావిధిగా వలంటీర్ల ప్రచారం
ఏపీలో వైసీపీ నేతలు, వాలంటీర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వైసీపీకి, వైఎస్‌ జగన్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ కనిపించారు. విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ మండలంలో వాలంటీర్లు వైఎస్‌ జగన్‌ పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఈసీ నిబంధనల ఉల్లంఘన జరిగింది.కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించిన సమయంలోనూ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగం చేయవద్దని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అనంతరం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిముకేశ్‌కుమార్‌ విూనా సైతం వాలంటీర్ల పాత్రపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కనుక వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ముకేశ్‌ కుమార్‌ విూనా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులలో టీచర్లకు మినహాయింపు ఉందని, ఎన్నికల విధుల్లో దాదాపు 60 శాతం వారే ఉంటారని చెప్పారు. అందుకే టీచర్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ అంత తేలిక కాదన్నారు. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే కేవలం ఓటర్ల వేలికి ఇంకు వేయడానికి పరిమితం చేస్తామని ఏపీ సీఈఓ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని హెచ్చరించినా, ఈసీ ఆదేశాలను ఏపీలో వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. పైగా ఇంటింటి ప్రచారానికి వెళ్లి వైఎస్‌ జగన్‌కు, వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నిఘా వ్యవస్థలా వినియోగించుకుంటుందని, వారికి ప్రజల డేటా ఎందుకు ఇవ్వాలని గతంలో పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ నేతలు ప్రశ్నించారు. వాలంటీర్లను ప్రభుత్వ సొమ్ముతో పోషించి, వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తాజాగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వాలంటీర్ల అంశం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన మధ్య మరోసారి వివాదంగా మారనుంది

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *