చెన్నై, మార్చి 18:తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపారు. అలాగే, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు నుంచి పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి తమిళిసై లోక్ సభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం తమిళిసై చెన్నైకి వెళ్తారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడిరచాయి. కాగా, 2019 సెప్టెంబర్ 8న తమిళిసై తెలంగాణ గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. గవర్నర్ పదవి చేపట్టక ముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. తాజాగా, లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారని సమాచారం.