బీజింగ్ నవంబర్ 23:కరోనా మహమ్మారి విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసే వార్త ఇది. కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మరో మహమ్మారి పురుడుపోసుకుంటున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. చైనాలోని బడుల్లో అంతుచిక్కని నిమోనియా వ్యాధి విజృంభిస్తున్నది. బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని దవాఖానలు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితులు మునుపటి కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్నాయి. కాగా, మిస్టరీ నిమోనియా వ్యాపిస్తుండటంతో స్కూళ్ల మూసివేత తప్పదని స్థానిక విూడియా వెల్లడిరచింది. బీజింగ్, లియోనింగ్ దవాఖానలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నది. బాధిత చిన్నారుల్లో అధిక జ్వరం, ఊపిరితిత్తుల మంట వంటి అసాధారణ లక్షణాలు ఉన్నట్టు తెలిపింది. అయితే ఇతర శ్వాసకోశ వ్యాధుల్లో కనిపించే దగ్గు, ఇతర లక్షణాలు లేవని వివరించింది.కాగా ప్రపంచదేశాల్లో మనుషులు, జంతువుల్లో వ్యాపించే వ్యాధులను ట్రాక్ చేసే సర్వైవలెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రోమెడ్ చైనాలో తాజా నిమోనియా వ్యాప్తి గురించి మంగళవారం బయటపెట్టింది. 2019లో కరోనా వ్యాప్తి గురించి కూడా ఈ సంస్థనే మొదట హెచ్చరించింది. చైనాలో తాజా శ్వాసకోశ వ్యాధి ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియదని పేర్కొన్నది. అలాగే పెద్దలు ఈ వ్యాధికి గురయ్యారా లేదా అన్న విషయాన్ని కూడా వెల్లడిరచలేదు. మరో మహమ్మారిగా ఇది మారుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేమని వివరించింది.