న్యూ డిల్లీ నవంబర్ 17: డీప్‌ఫేక్ వీడియోల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని సృష్టించడానికి కృత్రిమ మేధ ను ఉపయోగించడం సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని విూడియాను కోరారు.‘డీప్‌ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇటీవలే నేను గార్బా పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. అది నా దృష్టికి కూడా వచ్చింది. అదే కాదు అలాంటి వీడియోలు అనేకం సోషల్ విూడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డీప్‌ఫేక్ వీడియోలపై ప్రజలకు విూడియా వాళ్లు అవగాహన కల్పించాలి. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడు వాటిని ఫ్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని ఛాట్‌జీపీటీ బృందాన్ని కోరుతున్నా’ అని అన్నారు. డీప్‌ఫేక్ వీడియోస్ ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం పలువురు సినీ తారల మార్ఫింగ్ వీడియోలు వైరల్ కావడమే. ప్రముఖ సినీ తారలు రష్మిక మందన్నా కత్రినా కైఫ్, కాజోల్ వంటి వారికి సంబంధించిన కొన్ని మార్ఫింగ్ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సినీఇండస్ట్రీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.
రష్మిక, కత్రినా, కాజోల్.. డీప్‌ఫేక్ బాధితులే
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్‌అనే ఓ సోషల్ విూడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ విూడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, కాజోల్ కూడా డీప్‌ఫేక్ బారిన పడ్డారు. మరోవైపు డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది.
మార్ఫింగ్ చేస్తే మూడేండ్ల జైలు శిక్ష..
ఈ మేరకు సోషల్ విూడియా కంపెనీలకు ఒక అడ్వయిజరీని కూడా జారీ చేసింది. కృత్రిమ మేధ (ఏఐ)తో కంటెంట్‌ను తయారుచేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వాటిపై 24 గంటల్లోగా చర్యలు చేపట్టాలని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్..తదితర సోషల్ విూడియా సంస్థలకు సూచించింది. ఐటీ చట్టం`2000 సెక్షన్ 66`డీ కింద చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశముందని తెలిపింది. కంప్యూటర్ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల్ని మోసగిస్తే ఈ సెక్షన్ కింద రూ.లక్ష వరకు జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని అడ్వైయిజరీలో కేంద్రం గుర్తు చేసింది. ఐటీ నిబంధనావళిలో రూల్ 3(2) (బీ)ను ఉపయోగించి తప్పుడు వీడియోలను, కంటెంట్‌ను తొలగించవచ్చునని తెలిపింది. ఫిర్యా దు అందిన 24 గంటల్లోగా మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.