విజయవాడ, సెప్టెంబర్ 17: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు.అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతోంది.మూడు పార్టీలు కలిపి 164 అసెంబ్లీ,21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాయి. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మూడు పార్టీల నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల జాబితా కూడా అధికంగా ఉంది. దీంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలో కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీల మధ్య సమన్యాయం పాటించాల్సిన అవసరం సీఎం చంద్రబాబుపై పడిరది. అందుకే నామినేటెడ్ పోస్టుల ప్రకటన జాప్యం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఒక నామినేటెడ్ పోస్టును ఓ మాజీ అధికారికి పదవి ప్రకటించింది. ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య నియమిస్తూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు కూడా జారీచేసింది. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీనిపై కృష్ణయ్య ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన.ఇలా ఉత్తర్వులు వచ్చాయో లేదో కృష్ణయ్య పదవి బాధ్యతలు చేపట్టారు.పిసిబి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణయ్య టిడిపి కేంద్ర కార్యాలయానికి మర్యాదపూర్వకంగా వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. దసరా నాటికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అన్ని పదవులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నియమించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది పోటీకి దూరమయ్యారు. పొత్తుల్లో భాగంగా మారిన సవిూకరణలతో చాలామంది టిక్కెట్లు త్యాగం చేశారు. అటువంటి వారిలో దేవినేని ఉమా ఒకరు. ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్,పట్టాభికి పౌరసరఫరాల కార్పొరేషన్, మాజీమంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కు ఎస్టీ కమిషన్ పోస్టులు ఖరారు అయినట్లు తెలుస్తోంది.జనసేనతో పొత్తు విషయంలో చాలామంది టిడిపి నేతలు వెనక్కి తగ్గారు. అందులో ఆలపాటి రాజా ఒకరు. జనసేన కీలక నేతనాదెండ్ల మనోహర్ కోసం ఆయన తెనాలి సీటును వదులుకున్నారు.అందుకే ఆలపాటి రాజాకు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల ప్రకటనకు సంబంధించి జాప్యం జరిగింది.ఆగస్టు 15 నాటికి ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఐ విఆర్‌ఎస్ ద్వారా సర్వే కూడా చేపట్టారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పేర్లను సహకరించారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.అయితే సాంకేతికపరమైన అంశాలతో పాటు ఇటీవల వచ్చిన వరదలతో ఎప్పటికప్పుడు ఈ పోస్టుల ప్రకటనలో జాప్యం జరుగుతూ వచ్చింది.అయితే దసరాకు ముందే నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.దసరా నాటికి 30% పదవులు భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. కొత్త ఫార్ములా తో చంద్రబాబు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టిడిపికి 60,జనసేనకు 30, బిజెపికి 10% పదవులు కేటాయించనున్నట్లు సమాచారం.అయితే అంతకంటే ముందే ఓ మాజీ ఐఏఎస్ అధికారికి నామినేటెడ్ పోస్ట్ కేటాయించడం విశేషం.