టీటీడీలో వేగవంతంగా విజిలెన్స్ విచారణ
వివిధ విభాగాల్లో లావాదేవీలపై ఆరా
టెండర్లలో భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు
తిరుపతి:గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోణలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన లావాదేవీలపై రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి నిర్వహించిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు.
ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలకూ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అలానే అంతకు ముందు చైర్మన్, ఈవోగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు సమాచారం. సాధారణంగా టీటీడీలో ప్రతి ఏటా సుమారు రూ.300 కోట్ల వరకూ ఇంజనీరింగ్ పనులకు కేటాయింపులు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో టెండర్లలో భారీ ముడుపులు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. గోవిందరాజస్వామి సత్రాలకు రూ.420 కోట్లు, స్విమ్స్‌కు రూ.77 కోట్లు, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, ఇతర పనులకు నిధుల కేటాయింపుపై విజిలెన్స్ అధికారులు ..ముఖ్య గణాంక అధికారి బాలాజీకి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. టీటీడీలో ఆర్ధిక అవకతవకలను ఎందుకు అడ్డుకోలేదో సమాధానం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.