ఏప్రిల్ 8న ఖగోళంలో అద్భుతం
గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం
న్యూయార్క్ మార్చ్ 21: వచ్చే నెల 8న ఖగోళంలో అద్భుతం జరుగనుంది. ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఆ రోజున సంభవించనుంది. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు కొంత సమయం చీకటిగా మారుతుంది. అయితే భూమి, సూర్యునికి మధ్య వచ్చిన చంద్రుడు వృత్తాకారం సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. దీనికారణంగా సూర్యుని కిరణాలు భూమిని చేరుకోలేవు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంధకారం ఏర్పడుంది.
సుదీర్ఘ సూర్యగ్రహణం:
గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8న తేదీ అమావాస్య తిధి రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై తెల్లవారు జామున 1.25 గంటలకు ముగియనుంది. అంటే ఈ గ్రహణం మొత్తం సమయం 4 గంటల 39 నిమిషాల పాటు ఉండనుంది. దీంతో ఏప్రిల్ 8న సంభవించే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు సంపూర్ణ సూర్యగ్రహణ అద్భుతమైన దృశ్యం 50 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు ప్రజలు ఈ సంవత్సరం మళ్లీ చూడగలరని అంటున్నారు. అయితే ఇది భారత్లో కనిపించదు.
రింగ్ ఆఫ్ ఫైర్:
గతేడాది అక్టోబర్ 14న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతమైంది. ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, మధ్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడిరది. ఈ దేశాల్లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ చివరిసారి 2012లో కనిపించగా, తర్వాత 2046లో రానుంది.