యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి*
*- జిల్లా జడ్జి జింకా రెడ్డి శేఖర్*
*ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మాట్లాడిన రెడ్డి శేఖర్*
నెల్లూరు జిల్లా:యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు ప్రెసిడెంట్ జడ్జి జింకా రెడ్డి శేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం వేడుకలకు ఆయన ముఖ్య అతథిగా హాజరై మాట్లాడారు. చదువుతో పాటు సమాజంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. పలు వినియోగదారుల సంబంధిత చట్టాలు, కేసు దాఖలు చేసే విధానం, వివిధ డాక్యుమెంట్లు, కోర్టు ఫీజులపై శిక్షణ ఇచ్చారు. వస్తు, సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. అన్యాయమైన ఒప్పందం, వస్తు, సేవ లోపం, వైద్య నిర్లక్ష్యం, విద్యా సంస్థల ఫీజు రీఫండ్, రియల్ ఎస్టేట్, కొలతలు, తూనికల మోసాలు, రియల్ ఎస్టేట్ మోసాలు, విద్యుత్ చట్టం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సేవలోపం, బ్యాంకింగ్, భీమా సంస్థల మోసాల వంటి కేసులను వినియోగదారుల కోర్టుల్లో దాఖలు చేయవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ బిల్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనంతరం రెడ్డి శేఖర్ ను జిల్లా బీసీ సంక్షమాధికారి, యువజన వ్యవహారాల శాఖ సీఈవో ఆర్.వెంకటయ్య, కళాశాల యాజమాన్యం సన్మానించారు.