విజయవాడ, ఫిబ్రవరి 16: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. యాభై మంది రుత్విక్కుల ఆధ్వర్యంలో శుక్రవారం యాగం ప్రారంభమయింది. తొలి రోజు చంద్రబాబు దంపతులు యాగక్రతవులో పాల్గొన్నారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సంద ర్భంగా చంద్రబాబు`భువనేశ్వరి హోమాలు నిర్వహించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో రిత్వికులు యాగం నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్ లోనూచంద్రబాబు నివాసంలో యాగం జరిగింది. అప్పుడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు యాగాలు నిర్వహించడం కామన్ గా వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లోని తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇక కేసీఆర్ ఎన్నికలతో పాటు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా యాగం నిర్వహిస్తారు. ఎన్నికలకు ముందు పామ్ హౌస్ లో శారదాపీఠాధి స్వరూపానంద సమక్షంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. కానీ ఆయన యాగం ఫలితాన్నివ్వలేదని.. ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతుంది. స్వరూపానంద కేవలం కేసీఆర్ కు మాత్రమే కాదు ఏపీ సీఎం జగన్ కు కూడా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం దాదాపుగా ఏడాది పాటు ఓ ప్రదేశంలో యాగం చేశారు. జగన్ కూడా ఆ యాగానికి వెళ్లారు. తర్వాత కూడా చేశారని చెబుతున్నారు. ఈ సారి జగన్ కోసం రాజశ్యామల యాగాలు స్వరూపానంద చేస్తున్నారో లేదో స్పష్టత లేదు.. కానీ చంద్రబాబు దంపతులు మాత్రం.. రాజశ్యామల యాగం పూర్తి చేస్తున్నారు.