చెన్నై, మార్చి 20: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బీజేపీలో చేరారు. బుధవారం చెన్నైలో ఆమె కమలం పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తమిళిసై పువ్వు పార్టీలో చేరారు. ఆమె మెడలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే ప్రధాని మోడీ తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగానే ఆమోదించారు. అలాగే మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా రాజీనామా లేఖను పంపించారు.సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె రాజీనామా చేశారు. ప్రజాసేవ చేసేందుకు తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు తమిళిసై వెల్లడిరచారు. నిజాయితీ రాజకీయాలు చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె తెలిపారు.తమిళిసై.. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో తమిళిసై ఓడిపోయారు. గత ఏడాది నుంచి తమిళిసై తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వినిపించాయి. మొత్తానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో తమిళిసై పదవీకాలం మరో ఆరు నెలలు, పుదుచ్చేరిలో మరో రెండేళ్లు ఉంది.ఇదిలా ఉంటే బీజేపీ మూడో జాబితా త్వరలో విడుదలకానుంది. తొలి విడతలోనే తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. బుధవారమే తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్‌లోనే తమిళనాడు ఎన్నికలు ఉండడంతో తమిళిసై పేరు మూడో జాబితాలో ఉండనుంది. ట్యూటికోరిన్ నియోజకవర్గం నుంచే తమిళిసై మళ్లీ పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా? జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.