విజయవాడ, మార్చి 7 :చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్‌ ను తప్పుపట్టిన ఆయన.. ఇప్పుడు జగన్‌ నే అనుసరించడం విశేషం. ఉచితాలతో రాష్ట్రాన్ని శ్రీలంక గా మార్చేశారని, మరో వెనిజులలాగా మార్చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టారని కూడా విమర్శలు చేసిన సంగతి విధితమే. అయితే ఇప్పుడు చంద్రబాబు అవే సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గర కావాలని చూడడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇన్నాళ్లు చంద్రబాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ కోల్పోవడం ఖాయం అన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది అభివృద్ధి. ఆయన సంక్షేమానికంటే అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు. కానీ ఎన్నికల్లో గెలవడానికి ఆయన సంక్షేమ తారకమంత్రాన్ని పఠిస్తున్నారు. జగన్‌ కు మించి పథకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా కీలక పథకాలను ప్రకటించనున్నారు. అయితే అవన్నీ ఆర్థిక భారంతో కూడుకున్నవే. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చి జగన్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. బట్టన్‌ నొక్కుడుకు పరిమితం అయ్యారని చంద్రబాబు తరచూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాను సైతం బటన్లు నొక్కుతానని ప్రజలకు తేల్చి చెప్పడం విశేషం.టిడిపి, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జయహో బీసీ సభ నిర్వహించారు. చంద్రబాబుతో పాటు పవన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్‌ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని ప్రకటన చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తామని స్పష్టం చేశారు. బీసీల డిఎన్‌ఏ లోనే తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ, ఇతరత్రా అవకాశాలు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అందుకే బీసీ ఒక ప్రణాళిక అమలు కోసం రూ.1.50 లక్షల కోట్లు కేటాయిస్తామని కూడా చంద్రబాబు ప్రకటన చేశారు. బీసీల్లోని 153 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని కూడా హావిూ ఇచ్చారు. మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారిన 217 జీవోను రద్దు చేస్తామని కూడా వివరించారు.వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి జగన్‌ ప్రజాభిమానాన్ని చురగొన్నారు. వైసీపీని ఢీకొట్టాలంటే అంతకుమించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న ప్రకటన తప్పకుండా చేయాలి. అయితే 2014లో కూడా చంద్రబాబు చాలా హావిూలు ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ నవరత్నాలను అమలు చేశారు. సంక్షేమ పథకాలను సైతం నిరంతరాయంగా కొనసాగించారు. కానీ అభివృద్ధి చేయలేకపోయారన్న అపవాదును మూట కట్టుకున్నారు. కానీ అభివృద్ధి అనే అంశంతో ముందుకు సాగాల్సిన చంద్రబాబు సంక్షేమ తారకమంత్రాన్ని అందుకోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతోనే చంద్రబాబు సంక్షేమ పథకాల ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *